NTV Telugu Site icon

Priyanka Gandhi: పాలస్తీనాకు ప్రియాంక మద్దతు.. ప్రత్యేక బ్యాగ్‌తో హల్‌చల్

Priyanka

Priyanka

పాలస్తీనాకు కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ పార్లమెంట్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాలస్తీనా అని ముద్రించిన బ్యాగ్‌తో పార్లమెంట్ హాల్‌లో హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ షేర్ చేశారు. ‘‘కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు నిదర్శనం! జెనీవా ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించలేరని ఆమెకు స్పష్టంగా తెలుసు.’’ అంటూ షామా మహమ్మద్ పేర్కొన్నారు.

గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు వందిలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ తీరును మొదటి నుంచి ప్రియాంకాగాంధీ వ్యతిరేకిస్తున్నారు. పలుమార్లు ట్విట్టర్ వేదికగా ఇజ్రాయెల్ తీరును ఎండగడుతూ వచ్చారు. తాజాగా పార్లమెంట్‌ వేదికగా పబ్లిక్‌గా పాలస్తీనాకు సపోర్టుగా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ప్రియాంక ధరించిన ఈ ప్రత్యేక సంచిపై పుచ్చకాయ, పావురం బొమ్మలు ఉండడం విశేషం.

ఇదిలా ఉంటే ఇటీవల ప్రియాంక.. పాలస్తీనా ఎంబసీని కూడా కలిశారు. అంతేకాకుండా పాలస్తీనా సంప్రదాయక కండువాను కూడా ధరించారు. ఈ సందర్భంగా గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ అనాగరికం.. జాతిహత్యగా పేర్కొన్నారు. ఆలోచనాపరుడైన ప్రతి వ్యక్తి.. ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం.. ఇజ్రాయెల్ తీరును ఖండించాలని ఆమె గతంలో ఎక్స్‌లో డిమాండ్ చేశారు.

ఇటీవల వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో ప్రియాంక భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. తొలి అరంగ్రేటంలోనే బంపర్ మెజార్టీతో గెలుపొంది పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి అదానీ లంచాల వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది. దీంతో ఉభయ సభల్లో కూడా గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం ద్వారా ఎంపీగా గెలుపొందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. అప్పట్లో ఇది పెను దుమారం రేపింది. తాజాగా ప్రియాంక తీరును బీజేపీ ఖండిస్తుంది.

 

Show comments