దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు. చివరకు రైతులు ఉద్యమానికి దిగివచ్చి ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే రైతుల ఉద్యమంలో భాగంగా యూపీలో లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వేగంగా కార్లు నడిపించడంతో 8 మంది మరణించారు. ఇందులో నలుగురు రైతులు ఉండటంతో దేశవ్యాప్తంగా కేంద్రమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీరుపై, లఖీంపూర్ ఖేరీ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తోంది.
లఖీంపూర్ ఖేరీ ఘటనకు ముందు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రైతులను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ ఆందోళనను విరమించకుంటే ‘ రైతులను రెండు నిమిషాల్లో సరిచేస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ వ్యక్తులు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు హోదాకు తగ్గట్లు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని… కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే లఖీంపూర్ ఖేరీ సంఘటన జరిగేది కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్ట్. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులకు బెయిల్ తిరస్కరిస్తూ హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ మరోసారి ట్వీట్ చేశారు. లఖీంపూర్ ఖేరీ సంఘటనలో ముఖ్యమైన అంశం ఏమిటంటే… కేంద్రమంత్రి రైతులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం అని… బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవదని మంత్రి వ్యాఖ్యలు బలపరిచాయని.. లఖీంపూర్ ఖేరీ ఘటనపై న్యాయపోరాటం కొనసాగుతుందని..బాధిత రైతు కుటుంబం కోసం అందరం కలిసి న్యాయపోరాటం చేయాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో లఖీంపూర్ ఖేరీ ఘటన బీజేపీపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు భావించినప్పటికీ ఆ ప్రాంత ప్రజల మద్దతు బీజేపీ లభించడం కొసమెరుపు. ఆ జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను బీజేపీ పార్టీ దక్కించుకుంది. ఇంతలా దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయిన ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేఖత కనిపించలేదు.
लखीमपुर किसान नरसंहार में सबसे अहम पहलू था गृह राज्यमंत्री का "किसानों को देख लेने" की धमकी वाला भाषण।
भाजपा सरकार ने किसानों के पक्ष में खड़े होने की बजाय, अपने मंत्री की लाठी मजबूत की।
न्याय का संघर्ष जारी है
पीड़ित किसान परिवार व हम सब मिलकर न्याय की लौ बुझने नहीं देंगे। pic.twitter.com/K5kYBq5LKa
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 10, 2022