Prime Minister Narendra Modi reacts to Mallikarjuna Kharge’s ‘Ravan’ comments: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘ రావణ్’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం గుజరాత్‌లోని కలోల్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రావణ్ వ్యాఖ్యలను గురించి ప్రస్తావించారు. మోదీని ఎక్కువగా దూషించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడిని ఎప్పుడూ నమ్మ లేదని మోదీ అన్నారు. డిసెంబర్ 5వ విడత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీని ఎవరు ఎక్కువగా దూషించగలరు అనే దానిపై పోటీ నెలకొంది అని అన్నారు.
ఖర్గే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు మోదీ. గౌరవనీయులైన ఖర్గే నన్ను రావణుడితో పోల్చారు.. రాముడి ఉనికిని ఎప్పుడూ నమ్మని వారు ఇప్పుడు రామాయణం నుంచి ‘ రావణుడిని’ తీసుకువచ్చారని, నాపై ఇలాంటి కఠిన పదాలను ఉపయోగించిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు పశ్చాత్తాప పడకపోవడం, క్షమాపణలు చెప్పకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని మోదీ అన్నారు.
Read Also: Digital Rupee: నేడు డిజిటల్ రూపాయి ప్రారంభం.. తొలి విడతలో నాలుగు నగరాల్లో లాంచ్
దీనికి ముందు మంగళవారం గుజరాత్ ఎన్నికల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే ఓ ర్యాలీలో ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. ఎన్నికలు ఏదైనా తమ మొహం చూసి ఓటు వేయాలని మోదీ కోరుతున్నారని.. ఏమైనా రావణుడిలా మోదీకి 100 తలలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఇలా అన్నింటిలో ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని.. ఆయన ప్రధాని అని మరిచిపోయారని విమర్శించారు. ఈ విమర్శలు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వివాదానికి కారణం అయ్యాయి.
గుజరాత్ రాష్ట్రంలో మొదటి విడతగా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 5న రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.