Site icon NTV Telugu

Prashant Kishor: 14న నేను చెప్పిందే నిజమవుతుంది.. పోలింగ్‌పై ప్రశాంత్ కిషోర్ జోస్యం

Prashant Kishor

Prashant Kishor

బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. నెలల తరబడి తాను చెబుతున్నదే నిజమైందని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. గురువారం తొలి విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 64.66 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. బీహార్‌లో 60 శాతం కంటే ఎక్కువ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని నెలల తరబడి తాను చెబుతూనే ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు జన్ సురాజ్ పార్టీ ఒక ఎంపిక అయిందని.. ఈ విషయంలో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పోలింగ్‌ పెరగానికి ఛత్ పండుగ కూడా కలిసొచ్చిందని తెలిపారు. నవంబర్ 14న జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టించబోతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి: The Girlfriend Movie Review: రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ

బీహార్‌లో తొలి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఊహించని రీతిలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ఒక పండుగలా ఓటర్లంతా తరలివచ్చి ఓటు వేశారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాని రికార్డ్‌ను నమోదు చేసింది. తొలి విడతలో అత్యధికంగా 64.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. 1951 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని పేర్కొంది. అంటే దాదాపు 74 సంవత్సరాల తర్వాత 2025లో అత్యధిక పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Trump-Modi: మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు.. భారత్‌లో పర్యటనపై హింట్

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో భాగంగా గురువారం 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడతగా మంగళవారం 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. అధికార కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకుండగానే బరిలోకి దిగింది. ఇక ఇంటికో ప్రభుత్వం అంటూ ప్రతిపక్షం హామీ ఇవ్వగా.. అధికార కూటమి మాత్రం కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ మేనిఫెస్టో ప్రకటించింది. ఇలా ఎవరికి వారే ప్రజలపై అనేక హామీలు కుమ్మరించాయి. మేనిఫెస్టో ప్రభావమో.. లేదంటే మార్పు కోసమో తెలియదు గానీ.. ఈసారి పోలింగ్‌ శాతం మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓటర్లు తండోపతండాలుగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఆయా పార్టీలు విజయావకాశాలపై రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటున్నాయి.

తొలి విడతలో మహిళలు రికార్డ్ స్థాయిలో పాల్గొని ఓట్లు వేశారని ఎన్నికల అధికారి వినోద్ గుంజ్వాల్ తెలిపారు. ఓటింగ్ సమయంలో వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. 1951-52లో జరిగిన మొదటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో అత్యల్పంగా 42.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2000 సంవత్సరంలో 62.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2020లో 57.29 శాతం నమోదైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టింది. తొలి విడతలోనే 64.66 శాతం పోలింగ్ నమోదైంది.

 

Exit mobile version