ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో భాగమైన రష్మిక ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. దానికి తోడు రాహుల్ రవీంద్రన్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి తోడు ప్రమోషన్స్‌లో రష్మిక సహా రాహుల్ రవీంద్రన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తిని రెట్టింపు చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ది గర్ల్ ఫ్రెండ్ కథ
భూమా దేవి(రష్మిక ) విజయవాడలో పుట్టి పెరిగిన ఒక సామాన్యమైన మధ్యతరగతి అమ్మాయి. తండ్రి (రావు రమేష్) పెంపకంలో తల్లి లేని పిల్లగా ఎన్నో ఇబ్బందులు పడి ఆమె పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. అలాంటి ఆమెకు హైదరాబాద్ వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. అసలు తన ధ్యాస అంతా చదువు మీదే పెట్టాలని భావించే ఆమెను, మొదటి చూపులోనే ప్రేమిస్తాడు విక్రమ్ (దీక్షిత్ శెట్టి). క్రమంగా ఆమెను కూడా తనను ప్రేమించేలా చేసుకుంటాడు. ముందు బాగానే ఉన్న వీరి ప్రేమ కథ, విక్రమ్‌లోని మరో కోణాన్ని చూసిన తర్వాత హారర్ కథలా తోస్తుంది భూమా దేవికి. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే గదిలో ఉండడం భూమా దేవి తండ్రి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అలా చేయడం చూసి ఆ తండ్రి ఏమయ్యాడు, భూమా దేవి-విక్రమ్‌ల ప్రేమ కథ ఏమైంది, అసలు ఈ సినిమాకి ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, అలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ (ప్లస్సులు, మైనస్సులు)
ఈమధ్య కాలంలో వస్తున్న ప్రేమ కథలలో ఇది కూడా ఒకటిగానే అనిపిస్తుంది సినిమా చూడనంతవరకు. సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ అభిప్రాయాలు మారిపోవచ్చు. ఈ సినిమా కొందరికి బాగా కనెక్ట్ అయిపోతే, మరికొందరికి మాత్రం “ఇదేంట్రా ఇది, ఇలా ఉంది” అనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే, ఈ రోజుల్లో చాలా రిలేషన్షిప్స్ బ్రేకప్ స్టేజ్ దాటి వెళ్లడం లేదు. అలా ఎందుకు జరుగుతోంది అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. “ఈ రోజుల్లో ఇదంతా కామన్‌రా” అని ఒక మాటతో సరిపెట్టుకుంటున్నారు. కానీ, ఎన్నో ప్రేమలు పెళ్లిళ్ల వరకు ఎందుకు వెళ్లడం లేదు, ఒకవేళ పెళ్లిళ్ల వరకు వెళ్లినా ఆ బంధాలు ఎందుకు నిలబడటం లేదు అనే విషయం మీద పెద్దగా చర్చలు జరగడం లేదు, అంతకుమించి ఆలోచనలు కూడా వెళ్లడం లేదు.
కానీ, ఒక జంట అన్యోన్యంగా కనిపిస్తూ, అందరి ముందు చట్టా పట్టాలు వేసుకుని తిరిగినంత మాత్రాన వాళ్లు పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకోరు. ఆ అబ్బాయి దగ్గర అమ్మాయికి, అమ్మాయి దగ్గర అబ్బాయికి ఎలాంటి బెరుకు లేకుండా, తనకు తానుగా నచ్చినట్టుగా నడుచుకున్న రోజున వాళ్ళని పర్ఫెక్ట్ పెయిర్ లేదా కపుల్ అని అనాలి. ఈ సినిమా విషయంలో ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ నుంచి బయటపడిన అమ్మాయి, ఎక్కడో టూ టైర్ సిటీ నుంచి వచ్చి, ఇక్కడి ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడకుండా, స్నేహితుడు తగిలించిన ప్రేమ అనే బంధాన్ని భుజాల మీద నుంచి దింపి, తన జీవితం, తన ఆశయం కోసం ఎలా ముందుకు వెళ్ళింది అనేది ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు.
అయితే, సినిమాగా చూసుకుంటే ఒక మంచి సందేశం ఇచ్చాడు అనిపించేలా ఉన్న ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. అన్‌లాజికల్ అనిపిస్తుంది. సినిమాలో హీరో, హీరోయిన్లు పీజీ చదువుతూ ఉంటారు. దాదాపుగా పీజీ స్థాయికి వచ్చేటప్పటికి మిగతా యువతతో పోలిస్తే వారికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి. అలాంటి సమయంలో స్నేహితుల ప్రోత్సాహంతో ప్రేమలో పడటం లాంటి సీన్స్ కొన్ని కన్విన్సింగ్‌గా అనిపించవు. ఇవన్నీ ఇంటర్ కాలేజీలలోనో, కాలేజీలలోనో జరిగాయి అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, పీజీ చదువుకునే వారికి ఇలాంటి ఒక స్టోరీ అడాప్ట్ చేయడమే కాస్త ఇబ్బందికరమనిపించింది. అయితే, అన్ని అమ్మాయిలు ఇష్టపడేలా, అబ్బాయిలలో కొంతమంది మెచ్చుకునేలా ఈ సినిమా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే, ఆ విధానంలో ఆయన రాసుకున్న కథ ‘మగాళ్లు అంటేనే టాక్సిక్’ అనే లాంటి పరిస్థితిలకు తీసుకొచ్చేసే కొన్ని సీన్స్ మాత్రం అందరికీ యోగ్యం కానివిగానే అనిపిస్తాయి.
🌟 నటీనటులు & సాంకేతిక వర్గం
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో రష్మిక ఒక పీక్ పెర్ఫార్మర్‌గా తనను ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ఇలాంటి కథను విన్నాక, రెమ్యూనరేషన్ కూడా డిస్కస్ చేయకుండానే సినిమా చేస్తున్నానని చెప్పిన రష్మిక, తన పాత్రలో ఒదిగిపోయింది అనే చెప్పాలి. ఒకరకంగా నిజ జీవితంలో రష్మిక ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. రక్షిత్ శెట్టి నుంచి ఎంగేజ్‌మెంట్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చాక, చాలా టార్గెట్ సోషల్ మీడియా హేట్ ఆమె మీద కనిపించింది. దాన్నంతటినీ దాటుకుని ఆమె బయటకు వచ్చి, తనను తాను నేషనల్ క్రష్‌గా చెక్కుకున్న తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. దానిని జ్ఞప్తికి తెచ్చేలా ఈ సినిమాలో ఆమె పాత్ర ఉంది. ఇక దీక్షిత్ శెట్టి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్‌గా సినిమా చూస్తున్న వాళ్ళందరూ అతన్ని చాచిపెట్టి కొట్టాలి అనిపించేలా, కొందరు అబ్బాయిలు తమను తాము అతనిలో చూసుకునేలా అతను నటించాడు. ఇక వీరి తర్వాత ఆ స్థాయిలో నటనకు అవకాశం దక్కింది మాత్రం రోహిణి పాత్రకే. దీక్షిత్ తల్లి పాత్రలో నటించిన ఆమె కనిపించింది ఒకే ఒక సీన్‌లో. కానీ, తన పీక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక రావు రమేష్ నటన గురించి చెప్పేదేముంది, ఆయన కూడా కనిపించిన తక్కువ సీన్స్‌లోనే అదరగొట్టాడు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా టెక్నికల్ టీం గురించి చెప్పాలంటే, ముఖ్యంగా సంగీత దర్శకుడి గురించే మాట్లాడుకోవాలి. సినిమా మూడ్ క్యారీ చేయడంలో అతని సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసేశాయి. అలాగే, సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ మొత్తాన్ని ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌తో పాటు రాసుకున్న డైలాగ్స్ కొన్ని ఆలోచింపచేసేలా ఉన్నాయి. నిడివి విషయంలో కూడా కంప్లైంట్స్ లేవు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా ‘ది గర్ల్ ఫ్రెండ్’… టాక్సిక్ లవ్ నెవర్ విన్స్