Site icon NTV Telugu

Singer Zubeen Garg: ఈరోజు మళ్లీ జుబీన్ గార్గ్‌కు పోస్టుమార్టం.. అనంతరం అంత్యక్రియలు

Singer Zubeen Garg

Singer Zubeen Garg

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. జుబీన్ గార్గ్ మరణంపై పెద్ద ఎత్తున అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ గార్గ్ భార్య అనుమతితో రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. కొన్ని వర్గాల నుంచి వచ్చిన అనుమానాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రిలో నిపుణులైన వైద్యుల సమక్షంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Dhanush : సెన్సార్ క్లియర్ చేసుకున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’

జుబీన్ గార్గ్ డెత్ సర్టిఫికెట్‌పై కూడా అనుమానాలు ఉన్నాయని.. దీన్ని సీఐడీకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా అనుమానాలు ఉన్నాయని.. వివాదాలు సృష్టించడానికి ఈ పని చేయడం లేదని.. కొన్ని వర్గాల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: CM Revanth: మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఇక గార్గ్ అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం (సెప్టెంబర్ 23న) పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించారు. పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివస్తారన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. స్మారక చిహ్నం కోసం గౌహతి సమీపంలోని సోనాపూర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జుబీన్ గార్గ్ సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం (సెప్టెంబర్ 19) బోటుపై షికారు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. బోటులోంచి లైఫ్ జాకెట్ ధరించి నీళ్లల్లోకి దూకి ఈత కొట్టడం ప్రారంభించారు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. కొద్దిసేపటికే ఆయన స్పృహ కోల్పోయారు. కొద్దిసేపు నీళ్లలోనే శవంలా ఉండిపోయారు. అనంతరం సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఇక ఆయన మరణవార్త తెలియగానే అస్సామీయులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అంతేకాకుండా సింగపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి భౌతికకాయం వచ్చింది. అక్కడ నుంచి గౌహతికి చేరుకుంది. గౌహతి నుంచి గార్గ్ నివాసానికి తీసుకెళ్లే క్రమంలో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి పూలవర్షం కురిపించారు. ఆయన్ను తలచుకుంటూ మహిళలు, పిల్లలు, వృద్ధులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

జుబీన్ గార్గ్ 40 భాషల్లో పాడారు. 38,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అస్సాం సాంస్కృతిని పరిచయం చేశారు. ఇక గార్గ్ మృతి పట్ల అస్సాం ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

 

Exit mobile version