Site icon NTV Telugu

Pope Leo: భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించిన కొత్త పోప్..

Pope Leo

Pope Leo

Pope Leo: పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే, శనివారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. కొత్త పోప్‌గా బాధ్యతలు తీసుకున్న పోప్ లియో XIV, అమెరికా కార్డినల్ రాబర్ట్ ప్రెవోస్ట్ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతించారు. శాశ్వత శాంతి కోసం ఆశిస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: Murali Naik: మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షలు, 5 ఎకరాల పొలం.. తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం!

భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించిన పోప్, ఆదివారం తన మొదటి ఆశీర్వాదంలో ప్రపంచానికి ‘‘శాంతి అద్భుతాన్ని’’ ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. 80 ఏళ్ల క్రితం నాటి రెండో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ.. నేడు ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఘర్షణలను ఖండిస్తూ పోప్ ప్రాన్సిస్ చెప్పిన మాటల్ని పోప్ లియో ఉటంకించారు. ఈ సంఘర్షణలు ‘‘మూడో ప్రపంచ యుద్ధానికి ముక్కలుగా’’ ఉన్నాయని గతంలో పోప్ ప్రాన్సిస్ అన్నారు.

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్, ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు ప్రారంభించింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌పైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి తెగబడింది. ఆ తర్వాత, శనివారం తెల్లవారుజామున భారత్, పాకిస్తాన్ వైమానికి స్థావరాలపై విరుకుపడింది. ఈ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడంతో, రెండు దేశాలు సంయమనం పాటించాలని అంతర్జాతీయ సమాజం కోరింది. చివరకు, శనివారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి.

Exit mobile version