Site icon NTV Telugu

Poonch attack: పూంచ్ ఉగ్రదాడి ఎన్నికల ముందు బీజేపీ స్టంట్.. మాజీ సీఎం సంచలన ఆరోపణ..

Charnjit Singh Channi

Charnjit Singh Channi

Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో నిన్న భారత వైమానిక దళం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. అయితే, దీనిపై పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ‘‘ ఇవన్నీ ఎన్నికల స్టంట్లు, ఉగ్రవాద దాడులు కావు. ఇవి బీజేపీ ఎన్నికల ముందు చేస్తున్న స్టంట్స్ తప్ప మరోటి కాదు. ఇందులో వాస్తవం లేదు. బీజేపీ ప్రజల ప్రాణాలతో, శరీరాలతో ఆడుకుంటోంది’’ అని ఆయన అన్నారు.

Read Also: Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. మహిళా ఎంపీకి డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులు..

ఎన్నికలను తారుమారు చేసేందుకు బీజేపీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందని చన్నీ ఆరోపించారు. బీజేపీ తన ఎన్నికల అవకాశాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ముందస్తుగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి విన్యాసాలు ఆడుతారు, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని చన్నీ అన్నారు.

శనివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక IAF జవాన్ మరణించగా, నలుగురు గాయపడ్డారు. సూరంకోట్‌లోని సనాయ్ గ్రామంలో ఈ దాడి జరిగింది. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దాడి అనంతరం ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ దాడిని కాంగ్రెస్ నేత ఖండిస్తూ, పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

Exit mobile version