NTV Telugu Site icon

Uttar Pradesh: పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి.. తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి.. చివరకు

Cat

Cat

పూర్వకాలం నుంచే పెంపుడు జంతువులను సాదుకోవడం అలవాటైపోయింది. కుక్కలు, పిల్లులు, పక్షులను ఇలా పలు రకాల పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. ఇంట్లో మనిషి మాదిరిగానే భావిస్తుంటారు. వాటికి ఏ చిన్న ప్రమాదం వచ్చినా తట్టుకోలేరు. ఇదే మాదిరిగా ఓ మహిళ పిల్లిని పెంచుకుంది. దానికి ఆహారాన్ని అందిస్తూ, బాగోగులు చూస్తూ ప్రేమగా చూసుకునేది. అయితే పిల్లికి ఏమైందో ఏమోగాని హఠాత్తుగా చనిపోయింది. దీంతో ఆ మహిళ మానసికంగా కృంగిపోయింది. పిల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా తిరిగి బ్రతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు దాని మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆమె ఆశలు అడియాసలైన తర్వాత మూడవ రోజు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read:Union Minister Raksha Khadse: కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

32 ఏళ్ల పూజ అమ్రోహాలోని హసన్‌పూర్ లో నివసిస్తుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం పూజ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధల వల్ల పెళ్లైన రెండు సంవత్సరాలకు విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె తన తల్లి గజ్రా దేవితో కలిసి నివసిస్తోంది. కాగా ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి సాదుకుంటోంది. అది గురువారం చనిపోయింది. ఆమె తల్లి చనిపోయిన పిల్లిని పాతిపెట్టమని చెప్పగా పూజ అందుకు నిరాకరించింది. అది తిరిగి బ్రతికి వస్తుంది అంటూ.. రెండు రోజుల పాటు పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికి పూజ వినిపించుకోలేదు.

Also Read:MAD 2 : ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’

పెంపుడు పిల్లి మరణంతో కుంగుబాటుకు గురైన పూజ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడవ అంతస్తులోని తన గదిలోకి వెళ్లింది. ఆ రాత్రి 8 గంటల సమయంలో గజ్రా దేవి తన కూతురిని చూడటానికి వెళ్ళింది. తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. భయాందోళనకు గురైన పూజ తల్లి కేకలు వేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.