Site icon NTV Telugu

Elections: తెలంగాణతో సహా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేది అప్పుడే.. వారంలోగా షెడ్యూల్..?

Elections

Elections

Elections: త్వరలోనే ఎన్నికల నగారా మోగబోతోంది. తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని కసరత్తుల్ని పూర్తిచేసింది. వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియా సంస్థల ప్రకారం అక్టోబర్ 8-10 తేదీల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కథనాలు ప్రచురిస్తున్నాయి.

నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి సంబంధించిన వర్గాలు తెలిపినట్లు సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో, ఛత్తీస్గడ్ రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. కౌంటింగ్ ఒకే రోజు జరగనుంది.

Read Also: KTR: షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుంది.. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మిజోరాం అసెంబ్లీ కాలపరిమితి డిసెంబర్ 17తో ముగియనుంది. ఇక మిగతా రాష్ట్రాలకు జనవరి వరకు సమయం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంసిద్ధతను పరిశీలించింది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాలను ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం శుక్రవారం తన పరిశీలకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ అమలు, మద్యం, డబ్బు పంపకాలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరగబోతున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి కీలకం కానున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. మిజోరాంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉంది.

Exit mobile version