ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో 55 స్థానాలకు, ఉత్తరాఖండ్, గోవాలో అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం ప్రకారం గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ ఓటింగ్ నమోదైంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 75.29 శాతం ఓటింగ్ రికార్డైంది. సాయంత్రం 5 గంటల వరకు ఉత్తరప్రదేశ్‌లో 60.44 శాతం, ఉత్తరాఖండ్‌లో 59.37 శాతం ఓటింగ్ జరిగింది.
Read Also: Nirmala Sitharaman: కేంద్రం, ఆర్బీఐ మధ్య వార్..! ఇలా స్పందించిన ఆర్థిక మంత్రి
మూడు రాష్ట్రాల్లోని మొత్తం 165 అసెంబ్లీ స్థానాల్లో 1519 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్‌లో భాగంగా 9 జిల్లాలు బిజ్నోర్, సహరాన్‌పూర్, అమ్రోహా, సంభాల్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, బదౌన్, షాజహాన్‌పూర్ పరిధిలోని 55 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ.. 82 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలలో 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేశారు. గోవాలోని మొత్తం 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాంప్రదాయకంగా ద్విధ్రువ రాజకీయాలు ఉన్న రాష్ట్రం గోవాలో ఈసారి ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పోటీ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో 2017లో జరిగిన రెండో విడతలో 55 సీట్లలో బీజేపీ 38 సీట్లు గెలుచుకోగా, ఎస్పీకి 15, కాంగ్రెస్‌కు 2 సీట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. ఎస్పీ గెలుచుకున్న 15 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించారు.