Site icon NTV Telugu

DK Shivakumar: పీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్‌ను తొలగించేందుకు సిద్ధరామయ్య ప్లాన్..

Karnataka

Karnataka

DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కి దక్కాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రతిపాదన ఏం లేదని సీఎం సిద్ధరామయ్య ఓపెన్‌గానే చెబుతున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.

Read Also: Tesla: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా.. ముంబైలో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్..

ఇదిలా ఉంటే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్‌ను ఆ స్థానం నుంచి తొలగించాలని సీఎం సిద్ధరామయ్య శిబిరం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సీఎం వర్గం, పీసీసీ చీఫ్ పదవికి పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్కిహోళిని ప్రతిపాదిస్తోంది. ఆయన ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కావడంతో, కుల సమీకరణాలను అధిష్టానం ముందు సిద్ధరామయ్య వర్గం ఉంచింది.

పార్టీలో ‘‘ఒకరికి ఒకే పదవి’’ అనే నియమానికి అనుగుణంగా కర్ణాటక పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియమిస్తే జార్కిహోళి తన మంత్రి పదవిని వదులుకునేలా సీఎం వర్గం ఒప్పించింది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ మార్పు అమలు చేయాలని సిద్ధరామయ్య వర్గం హైకమాండ్‌ని కోరింది. డీకే శివకుమార్ ప్రభావాన్ని తగ్గించే ప్లాన్‌లో భాగంగా సీఎం వర్గం ఈ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యేలను స్వతంత్రంగా పిలవకుండా అడ్డుకునేందుకు డీకే అధికారాలకు కత్తెర వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version