కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ.ఆనంద్.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్లో కొంత మంది నేరాల్లో భాగమయ్యారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత బెంగాల్ పోలీసులు తమతో బేరసారాలకు పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇది కూడా చదవండి: UP: యోగి సర్కార్ తీరుపై ములాయం కోడలు అపర్ణ అలక.. ఎస్పీలో చేరేందుకు ఏర్పాట్లు!
గవర్నర్ బోస్ మీడియాతో మాట్లాడారు.. బాధితురాలి తల్లిదండ్రులు తనతో కొన్ని విషయాలు చెప్పారని.. అవి చాలా హృదయ విదారకంగా ఉన్నాయని తెలిపారు. వారు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. రెండు రోజుల్లో చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు సహా సమాజమంతా న్యాయం కోరుతోందని వెల్లడించారు. చట్టం ఉన్నప్పటికీ.. అది సక్రమంగా అమలు కావడం లేదన్నారు. పోలీసు వ్యవస్థలో కొంతమంది భ్రష్టుపట్టిపోయారని గవర్నర్ ఆనంద బోస్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: France: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నిక
వైద్యురాలి కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు. ఈ కేసుపై తొలుత కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వారు వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఇక ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోని ఆర్థిక అవకతవకలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ కస్టడీకి హైకోర్టు అప్పగించింది.
ఇది కూడా చదవండి: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం