NTV Telugu Site icon

Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఫోటోతో రెచ్చగొట్టే ప్రయత్నం.. కాంగ్రెస్ నేతపై పోలీస్ కేసు..

Digvijaya Singh

Digvijaya Singh

Digvijaya Singh: కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. దీనిపై ఆయనపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిగ్విజయ్ పై చర్యలు చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 469 (ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ చేయడం), 500 (పరువు నష్టం) మరియు 505 (ప్రజా దుష్ప్రవర్తనకు దారితీసే ప్రకటనలు) కింద తుకోగంజ్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది.

Read Also: Bandi Sanjay: బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. బండి సంజయ్ కు జాతీయ స్థాయి బాధ్యతలు

దళితులు, వెనకబడినవారు, ముస్లింలు, హిందువుల మధ్య వివాదాలను సృష్టించడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు గురూజీ( గోల్వార్కర్) ప్రయత్నించినట్లు ఆయన చిత్రంతో కూడిన పోస్టర్ ని దిగ్విజయ్ సింగ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీనిపై రాజేష్ జోషి ఫిర్యాదు చేశారు. గోల్వాల్కర్ పై దిగ్విజయ్ సింగ్ పోస్టు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మొత్తం హిందూ సమాజం యొక్క మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గోల్వాల్కర్ గురించి దిగ్విజయ్ సింగ్ తప్పుడు, అనవసరమైన పోస్ట్ చేశారని జోషి ఆరోపించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఫోటోను దిగ్విజయ్ శనివారం ట్వీట్ చేశారు. దళితులు, వెనుకబడినవారు, ముస్లింలకు సమాన హక్కులు కల్పించడం కంటే బ్రిటీష్ పాలనలో జీవించడమే తనకు ఇష్టమని గోల్వాల్కర్ చెప్పారని పోస్టులో ఆయన ఆరోపించారు. గోవాల్కర్ ఎప్పుడూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదిన ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ అన్నారు. గోవాల్కర్ ఆర్ఎస్ఎస్ సంస్థకు ఎక్కువ కాలం చీఫ్ గా పనిచేశారు. అందరూ ఆయన్ను గురూజీ అని పిలుచుకునే వారు. 1940-73 మధ్య కాలంలో ఆ సంస్థకు నాయకత్వం వహించారు.