PM Modi: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వరసగా రెండో రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రోజు శనివారం మూడు గంటల పాటు మోదీ రోడ్ షో జరిగింది. దాదాపుగా 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ శనివారం నగరంలో దాదాపు 26 కి.మీ రోడ్‌షో నిర్వహించిన ప్రధానిని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్డుకిరువైపుల బారులు తీరారు. ఆదివారం 10 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగుతుంది.
Read Also: King Cobra: ప్రమాదం అంచున “కింగ్ కోబ్రా”.. పాముల రారాజు ప్రత్యేకత, ప్రాముఖ్యత తెలుసుకోండి..
ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూ తిప్పసాంద్ర రోడ్ లోని కెంపేగౌడ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభం అయింది. కెంపేగౌడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత సెంట్రల్ బెంగళూర్ నుంచి ప్రధాని రోడ్ షో జరగనుంది. ఆదివారం రోజు 5 నియోజకవర్గాలను టచ్ చేస్తూ రోడ్ షో కొనసాగుతోంది. ప్రధాని వెంట కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడు అయిన కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఉన్నారు.
మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక ఎన్నికలను సెమీఫైనల్స్ గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని శక్తులను ఒడ్డుతోంది. కాంగ్రెస్ ఈ సారి బీజేపీని గద్దెదించాలని చూస్తోంది. ఇక కింగ్ కాకపోయినా.. కింగ్ మేకర్ అయినా కావాలని జేడీఎస్ భావిస్తోంది.
