Amit Shah: ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి నిన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. వచ్చే రోజుల్లో అమిత్ షాని ప్రధానిని చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తు్న్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘ఒకే దేశం-ఒకే నాయకుడి’’ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ ఇండియా కూటమికి ప్రధాని ఎవరని బీజేపీ అడుగుతోంది. నేను బీజేపీని వారి ప్రధాన మంత్రి ఎవరని అడుగుతున్నాను..? మోడీ జీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటారు. 75 ఏళ్ల వయసులో ఉన్న వారు పదవీ విరమణ చేస్తారని ఆయన స్వయంగా 2014లో నిబంధన పెట్టారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ వంటివారు పదవీ విరమణ చేశారు’’ అని అన్నారు.
Read Also: Paul Stirling: పాక్ జట్టును ఘోరంగా అవమానించిన ఐర్లాండ్ కెప్టెన్.. అసలు మ్యాటరెంటంటే..
ప్రధాని నరేంద్రమోడీ అమిత్ షాని ప్రధానిని చేసేందుకు ఓట్లు అడుగుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీజీ హామీలను అమిత్ షా నెరవేరుస్తారా..? అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పక్కకు తప్పుకుంటారని కేజ్రీవాల్ తప్పుగా భావిస్తున్నారని అన్నారు. ‘‘ బీజేపీ రాజ్యాంగంలో అలాంటి (75 ఏళ్ల పరిమితి) ఏమీ లేదు. కేజ్రీవాల్ అండ్ కంపెనీ, ఇండియా కూటమికి నేను చెప్పాలనుకుంటున్నాను. పీఎం మోడీ ఈ సారి కూడా పదవీ కాలాన్ని పూర్తిచేయబోతున్నారు. పీఎం మోడీనే అధికారంలో ఉంటారు. బీజేపీలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని షా స్పష్టం చేశారు.
అమిత్ షా మాట్లాడుతూ..కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై వచ్చాడని, తన అరెస్టు అక్రమం అంటూ సుప్రీంకోర్టు ముందు చెప్పినా కూడా ఉపశమనం లభించలేదని, మధ్యంతర బెయిల్ జూన్ 1 వరకు మాత్రమే ఇవ్వబడిందని, ఆ తర్వాత ఆయన లొంగిపోవాలని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ దీనిని క్లీన్‌చిట్‌గా భావిస్తే, చట్టంపై ఆయనకు ఉన్న అవగాహన బలహీనం అని అన్నారు.
