PM To Open Karnataka Expressway: మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ పెద్దలతో పాటు ప్రధాని నరేంద్రమోదీ వరసగా కర్ణాటకకు వెళ్తున్నారు. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని ఆరుసార్లు కర్ణాటకకు వెళ్లారు. నేడు రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టుల ఒపెనింగ్ తో పాటు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. జేడీఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మాండ్యాలో ఈ రోజు మైసూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు హుబ్బళ్లి-ధార్వాడ్ జిల్లాల్లో దాదాపు ₹ 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.మండ్యాలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాండ్యా స్వతంత్ర ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలత బీజేపీలో చేరనున్నారు.
Read Also: Viveka Murder Case: అరెస్టు చేసుకోండి.. అన్నింటికి సిద్ధమేనన్న భాస్కర్ రెడ్డి
మైసూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 118 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని రూ. 8480 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది బెంగళూర్, మైసూర్ నగరాల మధ్య ప్రమాణ సమయాన్ని 3 గంటల నుంచి కేవలం 75 నిమిషాలకు తగ్గనుంది. మైసూరు-ఖుషాల్‌నగర్ 4 లేన్ హైవేకి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 92 కి.మీ.లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సుమారు రూ. 4130 ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి వల్ల బెంగళూర్,ఖుషాల్ నగర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతోంది. ధర్వాడ్ లో ఐఐటీని ప్రారంభించనున్నారు. హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ రికార్డును ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను సుమారు రూ.20 కోట్లతో నిర్మించారు.