BJP: ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశానికి ఆ పార్టీ నేతలంతా సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు కాసేపట్లో బీజేపీ అత్యున్నత సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరుకాబోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల కమీషన్ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో తలమునకలైన సమయంలోనే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాలని చూస్తోంది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలోని 550 మందికి పైగా సభ్యులు రూపొందించిన జాబితాపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీప్ జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన నేతలు సమావేశానికి హాజరవుతున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమావేశానికి చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్ తదితర రాష్ట్రాల లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఒక్కో స్థానానికి మొదటి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో షార్ట్‌లిస్ట్‌లు రూపొందించబడ్డాయి. మార్చి 10 లోపు 300 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలని బీజేపీ యోచిస్తోంది. 2019లో కూడా బీజేపీ ఇదే గేమ్ ప్లాన్ అమలు చేసింది. ఇండియా కూటమిపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో వెళ్తోంది.