Site icon NTV Telugu

PM Sheikh Hasina India Visit: బంగ్లాదేశ్, భారత కీలక భాగస్వామి: ప్రధాని నరేంద్ర మోదీ

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Sheikh Hasina India Visit: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలోొ పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు షేక్ హసీనా. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని మోదీ, షేక్ హసీనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వచ్చే 25 ఏళ్లలో భారత్-బంగ్లా సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్, భారత దేశ అతిపెద్ద అభివృద్ధి, వాణిజ్య భాగస్వామి అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు.

Read Also: Asia Cup 2022: అలా జరిగితే ఆసియా కప్ పాకిస్థాన్‌దే.. సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఐటీ, అంతరిక్షం, అణురంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని మోదీ అన్నారు. విద్యుత్ ప్రసార మార్గాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. నదీ నీటి పంపిణీకి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య 54 నదులు ప్రవహిస్తున్నాయని.. ఈ రోజు కుషియార నదీ నీలటి భాగస్వామ్యానికి సంబంధించి కీలక ఒప్పందం జరిగిందని.. ప్రధానులు మోదీ, షేక్ హసీనా సంయుక్తంగా ప్రకటించారు. దీంతో పాటు ఉగ్రవాదం, రోహింగ్యాల సమస్యలు, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. ఇరు దేశాల చర్చలు ప్రజలకు మేలు చేస్తాయని ప్రధాని షేక్ హసీనా అన్నారు. మొత్తం ఇరు దేశాల మధ్య 7 ఎంఓయూలు కుదిరాయి.

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని.. తీస్తా నీటి భాగస్వామి ఒప్పందంతో పాటు ఇతర సమస్యలను త్వరలోనే ముగిస్తామని ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్‌కు భారతదేశం అత్యంత ముఖ్యమైన మరియు సన్నిహిత పొరుగు దేశమని, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని ఆమె అన్నారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ప్రధాని షేక్ హసీనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Exit mobile version