PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు మోదీ-అదానీ భాయ్ భాయ్ అని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. బుధవారం లోక్ సభలో సమాధానం ఇచ్చిన ఆయన, గురువారం రాజ్యసభలో కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.
Read Also: INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 ఆలౌట్
విపక్షాల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని.. కాంగ్రెస్ పాలనను దగ్గర నుంచి చూశా అని, ఆరు దశాబ్ధాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని, ఇతర దేశాలు అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ భారత దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని నిరాకరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గరీబీ హఠావో కేవలం నినాదమే అని, మధ్యవర్తుల చేతుల్లోకి డబ్బులు వెళ్లేవని తెలిపారు. దేశ ప్రజలను కాంగ్రెస్ వంచించిందని.. నేను ఎప్పుడూ రాజకీయాలను లబ్ధి కోసం చూడలేదని ఆయన వెల్లడించారు. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేశామని తెలిపారు. దశాబ్ధాలుగా ఆదివాసీలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని.. బడ్జెట్ లో మా ప్రభుత్వం లక్షా 20 వేల కోట్లను గిరిజనుల కోసం కేటాయించామని పేర్కొన్నారు. 13 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.
గత 3-4 ఏళ్లలో 11 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చామని.. జన్ ధన్ ఖతా ఉద్యమాన్ని ప్రారంభించి.. గత 9 ఏళ్లలో 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచామని సభలో పీఎం మోదీ చెప్పారు. కర్ణాటక కలబురిగిలో 8 లక్షల ఖాతాలతో సహా కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ ఖాతాలను ప్రారంభించామని దీన్ని మల్లిఖార్జున ఖర్గే చూడాలని సూచించారు. ఒకరి ఖాతా మూసేయబడుతోంది.. వారి బాధను అర్థం చేసుకోగలను అంటూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. దేశంలోని 25 కోట్ల కుటుంబాలకు ఎల్‌పిజి కనెక్షన్‌లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నిజమైన లౌకికవాదం వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూస్తోందని తెలిపారు. దేశంలో 110 వెనకబడిన జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో విద్యా, మౌళిక సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచామని వెల్లడించారు.