PM Modi: నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోడీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆయన గురువారం మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందని అన్నారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయని, ఇది కూడా అలాంటి సమయమే అని అన్నారు. సమయాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలని సూచించారు. మహిళలకు అధికారం ఉంటేనే వికసిత్ భారత్ అని, దేశాన్ని సరికొత్త దిశలోకి మార్చే చర్యలు చేపడుతున్నామని అన్నారు. మహిళలకు అధికారం ఇస్తే వారు కొత్త మార్గాన్ని చూపిస్తారని పేర్కొన్నారు. మహిళా బిల్లు దేశ చరిత్రలోనే అద్భుతమని కొనియాడారు.
ఈ బిల్లు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశాభివృద్ధిలో మహిళ పాత్ర చాలా ముఖ్యమని, ఈ బిల్లును వ్యతిరేకించే వారిని మహిళా లోకం క్షమించదని హెచ్చరించారు. 2024లోనే మహిళా బిల్లుకు విపక్షాలు అంగీకరించాయని గుర్తుచేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే వారికే రాజకీయ మనుగడ ఉంటుందని అన్నారు. ఇప్పుడు లోక్‌సభ ముందుకు వస్తే బిల్లును అడ్డుకుంటున్నారని విపక్షాలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. తమకు అన్యాయం చేసేవారిని మహిళలు అదునుచూసి దెబ్బకొడుతారని వార్నింగ్ ఇచ్చారు. విపక్షాల నేతలు తమ పదవులు కోల్పోతామనే భయంతో బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చిన బిల్లు కాదని, దేశ ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోడీ స్పష్టం చేశారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని, ఈ బిల్లును ఎప్పుడో తీసుకురావల్సిందని, గత ప్రభత్వాలు ఈ బిల్లు తీసుకురావడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. రాజకీయాల్లో తమ శక్తిని చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని, గ్రామస్థాయిలో మహిళలు రాజకీయాల్లో భాగం కావడం వల్ల వారికి రాజకీయ అవగాహన పెరిగిందని అన్నారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు, పార్లమెంట్‌లో ఉందుకు ఉండకూడదని ప్రధాని ప్రశ్నించారు.
