PM Narendra Modi 1200 Gifts To Be Aunctioned From Sept 17: సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా.. ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన 1200కి పైగా గిఫ్టులను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆయా సందర్భాల్లో క్రీడాకారులు, రాజకీయ నేతలతో పాటు సామాన్యులు అందజేసిన ఆ గిఫ్టులను సెప్టెంబర్ 17వ తేదీ నుంచి వేలానికి వేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగ మిషన్‌కు అందజేస్తారు. pmmementos.gov.in అనే పోర్టల్ ద్వారా ఈ వేల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ వేలం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనుందని, వీటి ప్రారంభ ధర రూ. 100 నుంచి రూ. 10 లక్షల దాకా ఉంటుందని మోడ్రన్ ఆర్ట్ నేషనల్ గ్యాలరీ డీజీ అద్వైత గదనాయక్ వెల్లడించారు.
కాగా.. వేలం వేసే కానుకల జాబితాలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అందజేసిన రాణి కమలాపతి విగ్రహంతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన హనుమాన్ విగ్రమం, సూర్యుడి పెయింటింగ్స్ ఉన్నాయి. అలాగే.. హిమచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ అందజేసిన త్రిశూల్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇచ్చి మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహం, ఏపీ సీఎం జగన్ ఇచ్చిన వెంకటేశ్వర స్వామి పటం ఉన్నాయి. ఇంకా శిల్పాలు, పెయింటింగ్స్, హస్తకళలు, జానపద కళాఖండాలు, సంప్రదాయ అంగవస్త్రాలు, తలపాగాలు, ఉత్సవ ఖడ్గాలు మొదలైన వస్తువులు ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు.. పతకాలు సాధించిన క్రీడాకారుల సంతకాలు, టీషర్టులు, బాక్సింగ్ గ్లౌజులు, జావెలిన్, రాకెట్ వంటి క్రీడా సంబంధిత ప్రత్యేక వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.