NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులపై మెతక వైఖరి అవలంభిస్తోంది.

Pm Modi

Pm Modi

PM Modi: 2008 జైపూర్ వరస పేలుళ్ల నిందితులను నిర్దోషిగా విడుదల చేయడాన్ని ప్రధాని నరేంద్రమోడీ తప్పపట్టారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు విధానాన్ని అవలంభిస్తోందని, ఉగ్రవాదులపై మెతక వైఖరి ప్రదర్శిస్తోందని ప్రధాని ఆరోపించారు. రాజస్థాన్‌లోని అబురోడ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, కాంగ్రెస్ అంతర్గత పోరుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ఎమ్మెల్యేలను నమ్మరని, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నమ్మరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

2008 జైపూర్ వరస పేలుళ్లను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుపై గట్టిగా పోరాడలేదని, ఫలితంగా వారంత నిర్దోషులుగా విడులయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ హాయాంలో రాజస్థాన్ లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు.ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం నేరస్థులపై చర్యలు తీసుకోవడానికి భయపడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో సీఎం గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ మధ్య విబేధాలను ప్రస్తావిస్తూ.. ఐదేళ్లుగా ముఖ్యమంత్రి తన కుర్చీ కాపాడుకునేందుకు చూశారని, అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.

Read Also: Police Harassed : ఖాకీ అరాచకం.. ముస్లిం ఎస్సై యువతిపై దాడి

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఏడాది మూడోసారి ప్రధాని రాజస్థాన్ పర్యటనకు రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రూ. 5,500 కోట్ల కన్నా ఎక్కువ విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. రాజస్థాన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని అన్నారు.

అంతకుముందు ప్రధాని ముందు సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించాలని, ప్రధాని మంత్రి కూడా ఆ దిశగా వెళ్తారని ఆశిస్తున్నట్లు గెహ్లాట్ అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆయన గుర్తు చేశారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే దేశం ముందుకు పోతుందని ఆయన అన్నారు. ప్రధాని జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభించడం ఆనందంగా ఉందని, ప్రస్తుతం రాజస్థాన్లో మంచి అభివృద్ధి పనులు జరిగాయని, గతంలో మేం అభివృద్దిలో గుజరాత్ తో పోటీ పడేవారమని, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రాన్ని అధిగమించామని గెహ్లాట్ అన్నారు.

Show comments