కేరళలో మార్పు అనివార్యమని ప్రధాని మోడీ అన్నారు. కేరళలో జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. ఈసారి ఎలాగైనా కేరళలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందుకు తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. అధికారంలోకి రాగానే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆభరణాల దారి మళ్లింపు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
‘‘రాబోయే ఎన్నికలు కేరళ పరిస్థితిని..దిశను మారుస్తాయి. ఇప్పటివరకు మీరు కేరళలో రెండు వైపులా మాత్రమే చూశారు. LDF, UDF.. రెండూ వరుసగా కేరళను నాశనం చేశాయి. కానీ మూడవ వైపు కూడా ఉంది. అది అభివృద్ధి.. సుపరిపాలన. అది బీజేపీ మాత్రమే.’’ అన్నారు. LDF-UDF అవినీతి, దుష్పరిపాలన, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
‘‘ఈ రోజు కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు కొత్త ఊపు లభించింది. ఈ రోజు నుంచి కేరళ రైలు కనెక్టివిటీ మరింత బలోపేతం అయింది. తిరువనంతపురాన్ని దేశంలోనే ఒక ప్రధాన స్టార్టప్ హబ్‌గా మార్చడానికి గణనీయమైన ప్రయత్నాలు జరిగాయి. కేరళ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పేదల సంక్షేమం కోసం ఒక కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ రోజు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రారంభించాం. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది.’’ అని అన్నారు.
