NTV Telugu Site icon

Congress: జూన్ 4 తర్వాత ప్రధాని మోడీకి లాంగ్ లీవ్.. జైరాం రమేష్ కామెంట్స్..

Jai Ram Raesh

Jai Ram Raesh

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్’’ భావజాలం ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన తరుణంలో ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ప్రధాని అబద్ధాలతో ఇప్పుడు దేశ ప్రజలు విసిగిపోయారని, జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్‌కి వెళ్లాల్సి వస్తుందని, ఇది భారత ప్రజల హామీ అని అన్నారు.

Read Also: Prashant Kishor: రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహా..

10 ఏళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్ 5 న్యాయ గ్యారెంటీలు భారత ప్రజల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ప్రస్తుతం చాలా అవసరమని, ఇది దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల గొంతుకగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 25 హామీలను ప్రకటించింది. రైతులకు మద్దతు ధర, కుల గణన, యువతకు ఉద్యోగాలు, నారీ న్యాయ్ పేరుతో ప్రతీ మహిళ ఖాతాలోకి రూ. 1 లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, కార్మికులకు కనీస వేతనాల వంటి హామీలను ఇచ్చింది.

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు భారతదేశ వ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తం 543 ఎంపీ స్థానాల్లో ఈ సారి బీజేపీకి సొంతగా 370 స్థానాలతో పాటు ఎన్డీయే కూటమికి 400కి పైగా సీట్లు వస్తాయని కమలం నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈసారి బీజేపీని గద్దె దించుతామని కాంగ్రెస్ చెబుతోంది.