NTV Telugu Site icon

PM Modi: నేడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గుడు పడ్వా, ఉగాది పండగ సందర్భంగా ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన స్మృతి మందిర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపక నాయకులకు నివాళులు అర్పిస్తారని శనివారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ తన పర్యటనలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్, సంస్థ రెండో సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పిస్తారు.

1956లో వేల మందితో కలిసి అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్ష భూమిలో బీఆర్అంబేద్కర్‌కి కూడా నివాళులర్పిస్తారు. మాధవ్ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌‌లోని నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఫెసిలిటీలో 250 పడకల ఆస్పత్రి, 14 ఔట్ పేషెంట్ విభాగాలు (OPDలు), 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి.

Read Also: Off The Record : అనిల్‌ కుమార్‌ అధికారంలో ఉన్నప్పుడు అంతన్నాడు ఇంతన్నాడు.. ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయాడా..?

వీటితో పాటు ప్రధాని మోడీ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌కు చెందిన మందుగుండు సామాగ్రి ఫెసిలిటీని సందర్శిస్తారు. కొత్తగా నిర్మించిన 1250 మీటర్లు, 25 మీటర్ల వెడల్పు కలిగిన మానవరహిత వైమానిక వాహనాల(UAVలు) కోసం నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్‌ను ప్రారంభిస్తారు. లైవ్ మునిషన్, వార్ హెడ్ పరీక్ష సెంటర్‌ని ప్రారంభిస్తారని ప్రకటనలో తెలిపారు.

ప్రధాని పర్యటన సందర్భంగా నాగ్‌పూర్‌లో విస్తృత భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రధాని కాన్వాయ్‌లో వీఐపీ రక్షణ కోసం RCEID (రేడియో నియంత్రిత ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్) జామర్ పరికరాలను కలిగి ఉన్న 20 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక యూనిట్లు, బాంబ్ స్వ్కాడ్, క్విక్ రెస్పాన్స్ టీం నుంచి 5000 మంది పోలీసులు మోహరించారు. మొత్తం 900 మంది ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై మోహరించనున్నారు. నాగ్‌పూర్ పర్యటన తర్వాత ప్రధాని ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌కి వెళ్లనున్నారు. అక్కడ ఆయన విద్యుత్, చమురు, గ్యాస్, రైలు, రోడ్డు, విద్య, గృహనిర్మాణ రంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.