Site icon NTV Telugu

New Parliament Inauguration: భారత ప్రజాస్వామ్యంలో మహత్తర ఘట్టం.. నేడు కొత్త పార్లమెంట్ ప్రారంభం

New Parliament

New Parliament

New Parliament Inauguration: భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహత్తర ఘట్టం ప్రారంభం కాబోతోంది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగ ప్రారంభం కాబోతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త పార్లమెంట్ ను భారత ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 60 మంది మతపెద్దలను కూడా ఆహ్వానించారు. ఉదయం 7 గంటలకు కొత్త భవనం వెలుపల ఉన్న పార్లమెంట్ ప్రాంగణంలో పూజతో కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రధాన అర్చకులు రాజదండాన్ని(సెంగోల్)ను ప్రధాని మోదీకి అందచేస్తారు. ప్రస్తుతం నిర్మించిన కొత్త పార్లమెంట్ ఇది వరకు ఉన్న 1927లో నిర్మితమైన భవనం కన్నా చాలా విశాలంగా నిర్మించారు.

Read Also: Rajinikanth: ఇది తమిళ శక్తి.. “సెంగోల్”పై కీలక వ్యాఖ్యలు.. ప్రధానికి ధన్యవాదాలు..

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నుండి తివాచీలు, త్రిపుర నుండి వెదురు ఫ్లోరింగ్ మరియు రాజస్థాన్ నుండి రాతి శిల్పాలతో కొత్త పార్లమెంట్ భవనం భారతదేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. పార్లమెంట్ లోపలి భాగంలో కమలం, నెమరి, మర్రిచెట్టు వంటి పెయింటింగ్ ఉన్నాయి. త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ ఇలా మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించడానికి గొప్ప రాజ్యాంగ మందిరం, ఎంపీల కోసం లాంజ్, లైబ్రరీ, బహుళ కమిటీలకు గదులు, భోజన ప్రాంతాలు, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ తో పాటు ఆప్, డీఎంకే, శివసేన(యూబీటీ), సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, కమ్యూనిస్ట్ పార్టీలుతో సహా 20కి పైగా పార్టీలు బహిష్కరించాయి. ఇదిలా ఉంటే బీజేడీ, బీఎస్పీ, అకాలీదల్, జేడీఎస్, వైసీపీ, టీడీపీ, ఏఐడీఎంకే వంటి 25 పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నామని స్పష్టం చేశాయి.

Exit mobile version