NTV Telugu Site icon

New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని

New Parliament

New Parliament

New Parliament: కేంద్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ మే 28న ప్రారంభించనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం రోజు ప్రధాని నరేంద్రమోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. నాలుగు అంతస్తుల్లో 1200 మంది ఎంపీలకు సరిపడేలా, అనేక సౌకర్యాలతో కొత్త పార్లమెంట్ ను నిర్మించారు. ‘‘కొత్త భవనం స్వావలంబన భారతదేశం లేదా ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి ప్రతీక’’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.

Read Also: Siddaramaiah: సీఎల్పీ లీడర్ గా సిద్దరామయ్య ఎన్నిక.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం

కొత్త పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రభుత్వ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా భారీ వేడుకల మధ్య ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి మే 26, 2023తో తొమ్మిదేళ్లు పూర్తవుతాయి. డిసెంబర్ 2020లో కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కొత్త భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పునరాభివృద్ధిలో భాగంగా ఉంది.

టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ కొత్త పార్లమెంట్ ను నిర్మించింది. భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వానికి గుర్తుగా గొప్ప రాజ్యాంగ మందిరం, పార్లమెంట్ సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, పార్లమెంట్ కమిటీల కోసం గదులు, విశాలవంతమైన పార్కింగ్ స్థలం ఉండనున్నాయి. కొత్త పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభ మార్షల్స్ కు కొత్త డ్రెస్ కోడ్ రానుంది. మొత్తం రూ. 862 కోట్ల వ్యయం అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విలువ రూ. 1200 కోట్లకు చేరుకుంది.