G20 Summit: జీ20 సమావేశాలకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తామైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్9-10 తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో పాల్గొంటున్న 15 దేశాల నాయకులతో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ఈ భేటీలు జరగబోతున్నాయి.
Read Also: G20 Summit: జీ20 సదస్సుకు ఏ దేశాధ్యక్షులు వస్తున్నారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారంటే ?
సెప్టెంబర్ 8న ప్రధాని మోడీ మారిషస్, బంగ్లాదేశ్ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఈ రోజు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని సమావేశమవుతారు. సెప్టెంబర్ 9న ప్రధాని మోదీ యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో ప్రధాని మోడీ లంచ్ మీటింగ్ ఉంటుంది. కొమొరోస్, టర్కీ, యుఎఇ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా దేశాల నాయకులతో సమావేశం ఉంటుందని తెలుస్తోంది. జీ20 సమావేశాలకు 30కి పైగా దేశాధినేతలు, అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరవుతున్నారు.
మరోవైపు అగ్రశ్రేణి దేశాధినేతలు వస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ చూసిన పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ఇతర ఏజెన్సీల అధికారుల ఉన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో జీ20 సమ్మిట్ జరగనుండటంతో ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. విమానాశ్రయం నుంచి దేశాధినేతలు బస చేసే హోటళ్ల వరకు, హోటళ్ల నుంచి జీ20 సమావేశం జరిగే ప్రాంతం వరకు భద్రత బలగాలు పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్ భద్రతను కల్పించనున్నారు. ఢిల్లీ పోలీసులకు భారత వైమానిక దళం (IAF) మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) మరియు కొన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) వంటి ప్రత్యేక కేంద్ర ఏజెన్సీలు కూడా సహాయం చేస్తున్నాయి.