NTV Telugu Site icon

PM Modi: ప్రతిపక్షాల ఫేక్ ప్రచారంపై ప్రధాని మోడీ ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రతిపక్షాలు ‘‘నకిలీ కథనాలను’’ ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. శనివారం ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇలా నకిలీ కథనాలను ప్రచారం చేసేవారు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాదికి వ్యతిరేకమని అన్నారు. ఉద్యోగాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నివేదికను ఉటంకిస్తూ ప్రధాని మోడీ మాట్లాడారు. దేశంలో సుమారు 8 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించామని, ఈ గణాంకాలు వారిని నిశ్శబ్ధం చేస్తాయని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ఈ వ్యక్తులు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు,దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని, వారి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఎన్డీయే పేదలకు, రైతులకు, యువతకు మద్దతు ఇస్తోందని చెప్పారు.

Read Also: CM Revanth Reddy: గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’.. రేపు సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ ప్రారంభించనున్న సీఎం

ముంబైలో రూ.29,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అటల్ సేతు వంతెనపై పగుళ్లు ఏర్పడిందన్న కాంగ్రెస్ ఆరోపణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలో జీవన నాణ్యతను ఉత్తమంగా చేయడమే తమ ఉద్దేశ్యమన్నారు. ముంబై చుట్టూ కనెక్టివిటీ పెరుగుతోందని, ముంబైలో కోస్ట్ రోడ్, అటల్ సేతు పూర్తయిందని చెప్పారు. అటల్ సేతు గురించి తప్పుడు ప్రచారం చేసేవారు కూడా ప్రయోజనం పొందుతున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌ని విమర్శించారు.

“అటల్ సేతు ఇప్పుడు రోజుకు 20,000 వాహనాలకు సేవలను అందిస్తోంది, 25 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. మెట్రో అభివృద్ధి కూడా వేగంగా పురోగమిస్తోంది. పదేళ్ల క్రితం ముంబైలో కేవలం 8 కి.మీ మెట్రో లైన్లు మాత్రమే ఉన్నాయి. నేడు, మనకు 80 కి.మీలు ఉన్నాయి, ఇంకా 200 కి.మీ.ల పని కొనసాగుతోంది.’’ అని ప్రధాని మోడీ చెప్పారు. ముంబైతో పొరుగు ప్రాంతాలకు వీటి ద్వారా కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అన్నారు. ముంబై ప్రపంచంలోనే ఫిన్ టెక్ రాజధానిగా మారాలని కాంక్షిస్తున్నట్లు చెప్పారు.