Site icon NTV Telugu

Modi-Trump: ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం.. ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై మోడీ రిప్లై

Modi

Modi

వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ప్రధాని మోడీతో కూడా ఫోన్‌లో మాట్లాడానని.. మోడీ గొప్ప స్నేహితుడని.. దీపావళి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. ఇద్దరి మధ్య అద్భుతమైన సంభాషణ జరిగినట్లుగా చెప్పుకొచ్చారు. అనేక విషయాలపై చర్చించినట్లుగా వివరించారు.

తాజాగా ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై ప్రధాని మోడీ స్పందించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీపాల పండుగ నాడు ఫోన్ కాల్ సంభాషణ.. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ రాసుకొచ్చారు.

ఈ మధ్య పాకిస్థాన్‌తో ట్రంప్ దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైట్‌హౌస్ వేదికగా పాకిస్థాన్ పెద్దలకు పెద్దపీట వేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో మోడీ తాజా ట్వీట్ ఆసక్తి రేపుతోంది. అన్ని రకాల ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం ఇరుపక్షాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని.. వాణిజ్య హెచ్చరికలతో యుద్ధాన్ని ఆపినట్లుగా ట్రంప్ పదే పదే చెప్పారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ ఖండించింది. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. ఇక రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. దీంతో అప్పటి నుంచి అమెరికాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల మోడీ బర్త్‌డేకి ట్రంప్ ఫోన్ చేసి విషెస్ చెప్పారు. తాజాగా దీపావళికి కూడా శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మళ్లీ మోడీ-ట్రంప్ మధ్య సంబంధాలు బలపడుతున్నట్లుగా తెలుస్తోంది.

 

 

Exit mobile version