Rahul Gandhi: ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలపై హమీల వర్షం కురిపించారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్గడ్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు కాంకేర్ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని శనివారం హమీ ఇచ్చారు. ప్రధాని మోడీ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ వాళ్లు రైతుల రుణమాఫీ చేయరు కానీ, అదానీ రుణాన్ని మాత్రం మాఫీ చేయగలుగుతారని దుయ్యబట్టారు. గతంలో రైతుల రుణమాఫీ చేశాం, ఛత్తీస్గడ్ లో రైతులు రుణాలను మరోసారి మాఫీ చేస్తామని అన్నారు. ప్రతీ బ్యాంక్ అకౌంట్ లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు చేయలేదు, కానీ నేను తప్పుడు వాగ్దానాలు చేయను, చెప్పినవి చేసిచూపిస్తానని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: 5 States Elections: గాడిదపై వచ్చి నామినేషన్.. ఎన్నికల సిత్రాలు..
బీజేపీ ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మా ప్రభుత్వం రైతులు, కార్మికులకు, పేదలకు సాయం చేస్తుంటే, బీజేపీ అదానీకి సాయం చేస్తుందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతుల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా, పాఠశాలలు మరియు కళాశాలలకు ఉచిత విద్యను కూడా గాంధీ హామీ ఇచ్చారు. ఛత్తీస్ గడ్ లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు.
బీజేపీ బీసీ కులగణనకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన నిర్వహిస్తామని చెప్పారు. 90 మంది ప్రభుత్వ కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారున్నారని, ఓబీసీల కోసం కేంద్రం 5 శాతం మాత్రమే ఖర్చు పెడుతోందని ఆరోపించారు.