Site icon NTV Telugu

Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ.. ప్రత్యేకత ఇదే!

Putin1

Putin1

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నాక ఒకే కారులో ప్రయాణం చేశారు.

ఇదిలా ఉంటే పుతిన్‌కు ప్రధాని మోడీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. రష్యన్ భాషలో ముద్రింపబడిన భగవద్గీతను బహుకరించారు. మోడీ అందజేసిన గిఫ్ట్‌ను పుతిన్ ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం భగవద్గీతలు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి.

ఇక పర్యటనలో భాగంగా శుక్రవారం 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా పుతిన్ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అధికారిక స్వాగతం లభించనుంది. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇక రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్‌ను భారత్‌లో పుతిన్ ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు. తిరిగి రాత్రి 9 గంటలకు రష్యాకు బయల్దేరి వెళ్లిపోతారు.
ఇదిలా ఉంటే గురువారం ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఆండ్రీ బెలోసోవ్ పలు అంశాలపై చర్చించారు. ఎస్-400 రక్షణ వ్యవస్థలపై కీలక చర్చలు జరిపారు. సుఖోయ్-57 యుద్ధ విమానాలను విక్రయించేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఒప్పందాలు ఇవే..
ఇక ఈ రోజు జరిగే ద్వైపాక్షిక సంబంధాల్లో 2 బిలియన్ డాలర్ల జలాంతర్గాముల లీజు ఒప్పందంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముడి చమురు దిగుమతులపై కూడా చర్చకు వచ్చే ఛాన్సుంది. అలాగే రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగావకాశాలపై ఒప్పందం జరగనుంది. అలాగే భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార, వినియోగ వస్తువుల ఎగుమతులపై ఒప్పందం జరిగే అవకాశం ఉంది.

Exit mobile version