ఎంతైనా ఖర్చును భరిస్తాం.. కానీ మా రైతులను బాధపెట్టం అని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ కలోల్‌లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ‘సహకార్ సే సమృద్’ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటుందని.. ఇందులో ఒక్కో 50 కిలోల యూరియా బ్యాగ్ కు రూ.3500 చెల్లిస్తున్నామని.. అయితే రైతులకు మాత్రం బ్యాగ్ రూ. 300 కే ఇస్తున్నామని అన్నారు. కేంద్రంపై రూ. 3200 భారం పడుతుందని ఆయన అన్నారు. అయినా రైతుల కోసం భరిస్తామని మోదీ అన్నారు.
యుపి, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలలో మూతపడిన 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునఃప్రారంభించామని ఇప్పటికే యూపీ, తెలంగాణాల్లో ఫ్యాక్టరీలు ఉత్పత్తిని ప్రారంభించాయని.. త్వరలోనే 3 కూడా ఉత్పత్తిని ప్రారంభిస్తాయని మోదీ వెల్లడించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియాకు వేపపూత పూశామని.. అప్పటి నుంచి యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు అందేలా చేస్తున్నామని మోదీ అన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎరువుల వినియోగాదారుగా.. మూడో అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారుగా ఉందని అన్నారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం యూరియా రైతుల వద్దకు చేరుకోక బ్లాక్ మార్కెటింగ్ జరిగేదని ప్రస్తుతం ఈ పరిస్థితి మారిందని అన్నారు.
నానో యూరియా వల్ల యూరియా బస్తా ప్రస్తుతం సీసాలోకి కుదించబడిందని.. దీని వల్ల రవాణా ఖర్చులు ఎంతో తగ్గుతాయని.. చిన్ని రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం గాంధీనగర్లో నిర్మించిన ఈ ప్లాంట్ వల్ల 1.5 లక్షల బాటిళ్ల యూరియా లిక్విడ్ తయారు చేసే వీలుందని.. వచ్చే కాలంలో దేశ వ్యాప్తంగా ఇలాంటివి 8 ఫ్లాంట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు.