Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో సోమవారం పర్యటించారు. ఇజ్రాయిల్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రధాని, భారత ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి కనబరచడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాహుల్ గాంధీ జూన్ నెలలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించడాన్ని ప్రస్తావించారు. అక్కడి చూసిన సంఘటనల్ని నమ్మలేకపోతున్నానని, మణిపూర్ ఆలోచనల్ని బీజేపీ నాశనం చేసిందని, ఇప్పడు మణిపూర్ ఒక రాష్ట్రం కాదని, రెండు రాష్ట్రాలని.. మైయిటీ, కుకీ తెగల మధ్య కొనసాగతున్న సంఘర్షణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు హత్యలకు గురైనా, మహిళలు వేధింపులకు గురైనా, పసిపిల్లలు చంపబడినా.. ప్రధానికి అక్కడికి వెళ్లడం ముఖ్యం కాదని భావిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
Read Also: Saindhav : సైకో గా వెంకటేష్.. ఆసక్తి రేకెత్తిస్తున్న సైంధవ్ టీజర్..
మేలో మణిపూర్ రాష్ట్రంలో కుకీ, మైయిటీ తెగల మధ్య జాతుల ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా.. ప్రధాని మోడీ మణిపూర్ పర్యటించకపోవడం సిగ్గుచేటని రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ హింస కేవలం సమస్యకు సంబంధించిన లక్షణం అని, భారత ఆలోచనపై దాడి జరుగుతోందని, దేశ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని ఆయన అన్నారు.
మణిపూర్ లో జరిగింది భారతదేశం యొక్క ఆలోచనపై దాడి అని అన్నారు. దీనికి విరుద్దంగా తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను నిర్వహించిందని, దేశంలోని ప్రతీ ఒక్క మతం, సంస్కృతి, భాష, సంప్రదాయాన్ని రక్షించడం యాత్ర ఉద్దేశమని చెప్పారు. ఈ రోజు మిజోరాంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఐజ్వాల్ లోని చన్మరి జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 40 మంది సభ్యులు ఉన్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.