PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!

  • ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం
  • ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ
  • భవిష్యత్ ప్రణాళికపై కీలక చర్చలు
Pmmodi

Pmmodi

ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. పశ్చిమాసియా యుద్ధం తర్వాత చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తడంతో ఆర్థికంగా ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. ఈ కష్టాలు ఇప్పుట్లో తీరేటట్లు కనిపించడం లేదు. పైగా కొత్తగా ఎల్‌నినో అనే సమస్య కూడా వస్తోంది. ఈసారి అత్యంత తీవ్రంగా సూపర్ ఎల్‌నినో వస్తోంది. ప్రపంచ దేశాల్లో కరవు సంభవిస్తుందని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శనివారం ఆర్థిక సలహా మండలితో సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న వేళ భారత్ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసే మార్గాలపై కీలక చర్చలు జరిపారు. ప్రపంచ సంక్షోభాల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలపై విస్తృతంగా చర్చించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది.

×
×
Ad

సమావేశంలో దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు చేపట్టాల్సిన సంస్కరణలు, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల విస్తరణ, వ్యాపార అనుకూల విధానాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, వ్యాపార నిర్వహణను సులభతరం చేసే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సంస్కరణలపై కూడా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

పశ్చిమాసియా సంక్షోభంపై సమీక్ష


పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావాన్ని కూడా మండలి సభ్యులు విశ్లేషించారు. చమురు ధరలు, వాణిజ్య మార్గాలు, ఎగుమతులు-దిగుమతులు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEs)పై ఈ సంక్షోభం కలిగించే ప్రభావంపై తమ అంచనాలను ప్రధానికి వివరించారు.

జీడీపీ వృద్ధిపై మోడీ హర్షం


ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధిరేటు 7.7 శాతంగా.. నాలుగో త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జూన్ 5న ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. భారత్ వృద్ధి వేగం బలంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. “2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం జీడీపీ వృద్ధి, నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదవడం భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత బలాన్ని, సంస్కరణల విజయాన్ని, 140 కోట్ల భారతీయుల కష్టాన్ని ప్రతిబింబిస్తోంది” అని మోడీ వ్యాఖ్యానించారు.

యువతకు అవకాశాలు

దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మోడీ స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లక్ష్యాల సాధన కోసం అవసరమైన అన్ని సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా సంక్షోభం భారత వాణిజ్యం, వ్యవసాయం, రైతులు, MSMEలు, కీలక పారిశ్రామిక రంగాలపై చూపే ప్రభావంపై నీతి ఆయోగ్ రూపొందించిన ప్రత్యేక అంచనా నివేదికను ఇటీవల ప్రధాని కార్యాలయానికి సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ ఆర్థిక వ్యూహాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.