Site icon NTV Telugu

Aurangzeb tomb: ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్..

Fdfsdf

Fdfsdf

Aurangzeb tomb: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఔరంగజేబు సమాధిని జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని భారత పురావస్తు సర్వే (ASI)ని ఆదేశించాలని కార్యకర్త కేతన్ తిరోద్కర్ తన పిటిషన్‌లో కోర్టుని కోరారు. ఔరంగజేబు సమాధి ఏఎస్ఐ చట్టం 1958లోని సెక్షన్ 3కి అనుగుణంగా లేదని వాదిస్తోంది. ఈ సెక్షన్ కొన్ని పురాతన స్మారక చిహ్నాలను, పురావస్తు ప్రదేశాలను జాతీయ ప్రాముఖ్యత కలిగినవిగా పేర్కొంటుంది.

ఔరంగజేబు సమాధి 14వ శతాబ్ధపు చిష్టి సాధువు షేక్ జైనుద్దీన్ దర్గా సముదాయంలో ఉంది. దీనికి సమీపంలోనే ఔరంగజేబు కొడుకుల్లో ఒకరి సమాధితో పాటు హైదరాబాద్ మొదటి నిజాం అసఫ్ జా 1, అతడి కుమారుడు నాసిర్ జంగ్ సమాధులు కూడా ఉన్నాయి. ఈ సమాధులను కూడా కూల్చివేయాలని పిటిషన్‌లో కోరుతున్నారు.

Read Also: Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!

జాతీయ ప్రాముఖ్యత అంటే ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా సమూహం కంటే దేశానికి విలువైనదిగా ఉండాలని పేర్కొంటుందని, దాని ప్రాముఖ్యత మొత్తం దేశంపై ప్రభావం చూపుతుందని నిర్వచిస్తుందని, దీని ప్రభావాన్ని భవిష్యత్ తరాలు సానుకూల రీతిలో అర్థం చేసుకోవాలని వాదిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘ఔరంగజేబు సమాధి జాతీయ ప్రాముఖ్యతను సూచిస్తూ, ఒక జాతీయ స్మారక చిహ్నంగా ఉండటం అనేది స్వయంగా చేసుకున్న అవమానం. భారతదేశంలో చెంఘిజ్ ఖాన్, మొహమ్మద్ ఘోరీ,అలెగ్జాండర్ వంటి వ్యక్తులకు మనం ఎప్పుడూ స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయలేదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇటీవల విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా తర్వాత ఔరంగజేబు సమాధిని మరాఠా గడ్డపై నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సినిమా తర్వాత మహారాష్ట్రలో భావోద్వేగాలు బలపడ్డాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ని ఔరంగజేబు హింసించి చంపడంపై కొందరు ఎమోషనల్ అవుతున్నారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నాగ్‌పూర్‌లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

Exit mobile version