Pinarayi Vijayan: కాంగ్రెస్ పార్టీపై ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న సీపీఎం విరుచుకుపడింది. ఆ పార్టీ నేత, కేరళ సీఎం పినరయి విజయన్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫేస్టోలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై ప్రస్తావన లేకపోవడాన్ని సీఎం ప్రశ్నించారు. సీఏఏపై కాంగ్రెస్ ’’నేరపూరిత మౌనం’’ అవలంభిస్తోందని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ సవాళ్లను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు.
Read Also: Siddaramaiah: మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేయండి.. ఓటర్లను కోరిన సీఎం..
ఆర్ఎస్ఎస్ తమ విపరీతమైన హిందుత్వ రాజకీయాలతో భారీ సవాళ్లను లేవనెత్తుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫేస్టో ఆ సవాళ్లను తీవ్రంగా పరిగణించడం లేదని అన్నారు. మనదేశంలో సీఏఏ విభజనకు కారణమయ్యే ప్రమాదకమైన ఉపాయమని పేర్కొన్నారు. సీపీఎం మేనిఫేస్టోలో సీఏఏ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. సీఏఏపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అలప్పుజలో శనివారం ఆయన అన్నారు.
గత ఐదేళ్ల అనుభవంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రయోజనం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారని, గతంలో జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట నిరసనలు తెలపడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, సీఏఏకి వ్యతిరేకంగా పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ మతరాజకీయాలు వామపక్షాలు అనుమతించవని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలువకుండా చూస్తామని అన్నారు. బీజేపీ 20 స్థానాల్లో ఓడిపోతుందని అన్నారు. కేరళలో రెండో దశ ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి.
