Site icon NTV Telugu

Pinarayi Vijayan: అగ్నిపథ్‌ని నిలిపివేయండి..మోడీకి కేరళ సీఎం లేఖ

Kerala Cm

Kerala Cm

దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీం మంటలు రాజేస్తోంది. ఈ పథకంపై విపక్షాలు, నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశ యువ‌త‌కు ఉద్యోగాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై నిర‌స‌న‌లు వెల్లువెత్తినా.. కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈ ప‌థ‌కంపై ర‌క్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ ద‌ళాల అధినేత‌ల‌తో వ‌రుస‌గా రెండో సారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంత‌రం త్రివిధ ద‌ళాల అధిప‌తులు… అగ్నిప‌థ్ ప‌థ‌కంపై వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అగ్నివీర్‌ల‌కు ల‌భించే సౌల‌భ్యాల‌ను కూడా వారు వివ‌రించారు.

అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని వాయిదా వేయాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్. అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలంటూ కేర‌ళ సీఎం లేఖ రాశారు. త‌క్షణ‌మే అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిలిపివేయాల‌ని కోరిన విజ‌య‌న్‌… యువ‌త‌లో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌పై దృష్టి సారించాల‌ని కోరారు. మరోవైపు అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.

నాలుగేళ్ల పాటు పనిచేసిన అగ్నివీరులను బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటామని విజయవర్గీయ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులను నియమించేటప్పుడు మొదటి ప్రాధాన్యత ఈ అగ్నివీరులకే ఇస్తామని ఆయన అన్నారు. విజయ్ వర్గీయ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. యువతను, ఆర్మీ సిబ్బందిని చులకన చేయొద్దని హితవు పలికారు. కైలాష్ విజయ్ వర్గీయ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం వ్యంగ్యంగా స్పందించారు. భారత సైన్యంలో పనిచేసి వచ్చిన అగ్నివీరులను రాజకీయ పార్టీ ల ఆఫీసుల ముందు కాపలాదారుగా నియమిస్తారా. అలా నియమించే వ్యక్తికి శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేశారు వరుణ్ గాంధీ.

Finance Ministry: విమాన ప్రయాణానికి ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

Exit mobile version