Physical assault on woman in Delhi:ఢిల్లీలో మృగాళ్లు దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోసారి ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసే విధంగా ప్రవర్తించారు. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. తీవ్ర గాయాలపాలైన సదరు బాధిత మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ సీరియస్ అయ్యారు. అధికారుల నుంచి వివరాలు కోరారు. తీవ్రగాయాల పాలైన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
శాటిలైట్ టౌన్, ఢిల్లీని కలిపే మార్గంలో పడి ఉన్న మహిళను పోలీసులు మంగళవారం ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం ఘజియాబాద్ లో బర్త్ డే పార్టీ ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న మహిళను ఆమె సోదరుడు బస్టాండ్ లో దింపేశాడు. ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఒక కారు ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మహిళను కారులోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
2 రోజుల పాటు మహిళపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు భాగాల్లోకి రాడ్ చొప్పించారు. ప్రస్తుతం బాధిత మహిళ ప్రాణాల కోసం పోరాడుతోంది. ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ నిందితుల వివరాలను కోరుతూ.. నోటీసులు జారీ చేశారు. మహిళ రక్తపు మడుగులో ఉందని.. ఆమె శరీరంలో ఇనుప రాడ్ ఉందని..ఆమె పరిస్థితి విషమంగా ఉందని పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే బాధితురాలు, నిందితులకు మధ్య ఆస్తి తగాదా ఉందని.. విషయం కోర్టు పరిధిలో ఉందని.. మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఘజియాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.