Site icon NTV Telugu

Kerala Bandh: కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ.. పలు జిల్లాల్లో రాళ్లదాడులు

Kerala Bandh

Kerala Bandh

PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి.

ఈ అరెస్టులపై పీఎఫ్ఐ పాటు కొంతమంది ముస్లింలు ఈ దాడులను ఖండించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో అరెస్టులకు వ్యతిరేకంగా గురువారం ఆందోళనలు నిర్వహించారు. అరెస్టులకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ శుక్రవారం కేరళ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ సంస్థకు చెందిన అగ్రనేతలను అరెస్ట్ చేయడం పట్ల ఆందోళన కార్యక్రమాలు, హర్తాళ్ చేపట్టారు. గురువారం ఎన్ఐఏ జరిపిన దాడుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన 22 మంది ఫీఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల హర్తాళ్ ఉద్రిక్తతలను పెంచింది. తిరువనంతపురం, కొల్లం, కోజికోడ్, వాయనాడ్, అలప్పుజా జిల్లాల్లో ప్రభుత్వ బస్సులపై రాళ్లతో దాడులు చేశారు. ఇద్దరు సివిల్ పోలీసు అధికారులను పిఎఫ్‌ఐ ఆందోళనకారులు కిందకు నెట్టారు.

REad ALSO: Bus Accident in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి

పీఎఫ్ఐ బంద్ నేపథ్యంలో అప్రమత్తం అయిన కేరళ రాష్ట్రపోలీసులు అన్ని జిల్లాల్లో కూడా భారీగా భద్రతను పెంచారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ యథావిధిగా నడుస్తుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పీఎఫ్ఐ నిరసనలకు పిలునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో భద్రతను పెంచారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్ఐఏ పని చేస్తుందని పీఎఫ్ఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిన్న అరెస్ట్ అయిన వారిలో పీఎఫ్ఐ జాతీయ చైర్మన్ ఓఎంఏ సలాం, జాతీయ కార్యదర్శి నసరుద్దీన ఎలమరం, కేరళ అధ్యక్షుడు సీపీ మహ్మద్ బషీర్ ఉన్నారు.

Exit mobile version