NTV Telugu Site icon

Diya Kumari: “ప్రజల యువరాణి”.. రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..

Dia Kumari

Dia Kumari

Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.

ప్రజల యువరాణిగా గుర్తింపు:

జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు. ఆమె తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్, ఈయన 1971 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇతని పరాక్రమానికి మహావీర చక్ర అవార్డు లభించింది. రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ, అత్యంత సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా ఆమెకు పేరుంది. ‘‘జైపూర్ కుమార్తె’’, ‘‘వీధుల్లో నడిచే యువరాణి’’గా దియాకుమారికి పేరుంది. ఈ గుర్తింపే ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తిని చేసింది.

దియా కుమారి నరేంద్ర సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో ప్రస్తుత జైపూర్ ప్రస్తుత మహారాజా పద్మనాభ్ సింగ్ కూడా ఒకరు. దియాకుమారి 2018లో తన భర్తతో విడాకులు తీసుకున్నారు.

2013లో బీజేపీలో చేరిన దియా కుమారి వరసగా మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారిగా 2013లో సవాయ్ మాధోపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో లోక్ సభ ఎన్నికల్లో రాజ్‌సమంద్ నుంచి 5.5 లక్షల భారీ ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ నుంచి గెలుపొందారు.

52 ఏళ్ల దియా కుమారి పర్యావరణం, విద్యా, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి అంశాలపై ఎన్నికల్లో ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా ఆమె పాఠశాలలు, ట్రస్టులు, హోటళ్లు వంటి అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈమె మహారాజా మాన్ సింగ్-2 మ్యూజియం ట్రస్ట్, జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్టులను కూడా పర్యవేక్షిస్తు్న్నారు. తన పేరు మీదనే ‘‘ప్రిన్సెస్ దియాకుమారి ఫౌండేషన్’’ని నడుపుతోంది.

Show comments