Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారాయి. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య ‘‘హిందీ’’ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయంపై పవన్ కామెంట్స్ తమిళనాట కాక పుట్టించాయి. ‘‘డబ్బు కోసం తమిళ సినిమాను హిందీలోకి డబ్ చేయడానికి అనుమతిస్తారు, కానీ భాషను వ్యతిరేకిస్తారు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ సమగ్రత కోసం భారతదేశానికి తమిళంతో సహా అన్ని భాషలు అవసరమే అని చెప్పారు.
Read Also: AAA : దర్శకుడు అట్లీ దెబ్బకు బడా నిర్మాణ సంస్థ పరార్..
‘‘తమిళనాడులో, ప్రజలు హిందీ విధించడాన్ని వ్యతిరేకిస్తారు. ఇది నన్ను ఆశ్చర్యపరుస్తుంది, వారికి హిందీ వద్దు, మరి ఆర్థిక లాభాల కోసం తమిళ చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారు? వారు బాలీవుడ్ నుండి డబ్బు కోరుకుంటారు కానీ హిందీని అంగీకరించడానికి నిరాకరిస్తారు. అది ఏ రకమైన పద్ధతి?’’ అని జనసేన అధినేత ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను స్వాగతించి, ఆ భాషను తిరస్కరించడం అన్యాయమని ఆయన చెప్పారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై డీఎంకే గట్టిగానే స్పందించింది. తమిళనాడులో ఎల్లప్పుడూ ద్విభాష విధానాన్ని మాత్రమే అవలంబిస్తోందని, పవన్ కళ్యాన్ పుట్టకముందే ఒక బిల్లు ఆమోదించబడిందని డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు. మేము 1938 నుండి హిందీని వ్యతిరేకిస్తున్నాము… నటుల నుండి కాదని చెప్పారు. డీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. తమిళనాడు వైఖరిని ఆయన అర్థం చేసుకోలేదని అన్నారు. తమిళనాడు ఎప్పుడూ వ్యక్తులు హిందీ లేదా మరే ఇతర భాష నేర్చుకోవడాన్ని వ్యతిరేకించలేదని, మా రాష్ట్ర ప్రజలపై హిందీ లేదా మరే భాషనైనా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అన్నారు.