Revokes Suspension of Congress MPs: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెన్షన్ కు గురైన నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సభా వ్యవహారాలకు అడ్డుతగిలే విధంగా.. కాంగ్రెస్ ఎంపీలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్భనంపై నిరసన తెలిపారు. దీంతో ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సెషన్ మొత్తం ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్ లను సస్పెండ్ చేశారు. జూలై 25న లోక్ సభలో ప్లకార్డులు, పోస్టర్లతో నినాదాలు చేసినందుకు సస్పెండ్ చేశారు.
Read Also: Farmani Naaz: “శివ్ భజన్” ఆలపించిన ముస్లిం సింగర్.. ముస్లిం సంఘాల నుంచి అభ్యంతరం
ఇదిలా ఉంటే తాజాగా సోమవారం రోజు స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్ కోరడంతో.. ప్రభుత్వం నలుగురు ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలని ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీంతో ఈ నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ ఘటన గురించి స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనపై అందరూ బాధపడ్డారని.. నేను కూడా బాధపడ్డానని అన్నారు. దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థ పార్లమెంట్ అని.. ఇక్కడి పార్లమెంటరీ సంప్రదాయాలపై అందరం గర్విస్తున్నామని.. ఈ గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం ప్రజాప్రతినిధుల సమిష్టి బాధ్యత అని ఆయన అన్నారు. అన్ని పార్టీ నాయకులు, సభ్యులు సభా మర్యాదలను కాపాడుకోవాలని అన్నారు. సభలో అందరికి సమయం, అవకాశం ఇస్తామని ఓం బిర్లా అన్నారు.