Pakistan: 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్‌కి షాక్‌లు ఇస్తోంది. పాక్ ప్రాణాధారమైన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసి, దేశంలో ఉంటున్న పాకిస్థానీలను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌పై చర్యల విషయంలో భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. టైమ్, టార్గెట్, ప్లేస్ సైన్యమే చూసుకోవాలని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఇప్పటికే సంక్షోభాన్ని నివారించేలా ప్రపంచదేశాలను పాక్ కోరుతోంది. మరోవైపు, పాక్ వ్యాప్తంగా భయాందోళనలు నెలకున్నాయి. భారత దాడిని అడ్డుకునేందుకు పాక్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో సహా నేవీ నౌకల్ని కరాచీలోని నౌకాశ్రయంలో మోహరించింది. తాము భారత దాడిని ఎదుర్కోగలమని పాక్ సైనిక వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ తన పౌర విమానాల కార్యకలాపాలను 50 శాతానికి తగ్గించింది. గగనతలంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అవసరమైన కార్యకలాపాలను మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Read Also: CRPF: సీఆర్పీఎఫ్ ఆపరేషన్ విజయవంతం.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు..!
పాకిస్తాన్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అత్తౌల్లాతరార్ మాట్లాడుతూ.. భారత్ రాబోయే 24-36 గంటల్లో తమ దేశంపై సైనిక చర్య ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం ఉందని భారత్ కల్పిత ఆరోపణలు చేస్తోందని చెప్పారు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పారు. తటస్థ దర్యాప్తుని పాకిస్తాన్ కోరుతోందని, అందుకు సహకరిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.
మరోవైపు, పాకిస్తాన్ ప్రధాని సంక్షోభాన్ని నివారించాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ అంటోనియో గుటెర్రస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పాకిస్తాన్ అన్ని రకాల ఉగ్రవాదాలను తిరస్కరిస్తుందని, పహల్గామ్ దాడిపై భారత్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అన్నారు. పహల్గామ్ సంఘటనపై పారదర్శక, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ శాంతికి కట్టుబడి ఉందని చెబుతూనే, దాడి చేస్తే పూర్తి శక్తితో ఎదుర్కొంటామని షరీఫ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.