CRPF: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. గత 9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఘనవిజయం సాధించింది. మావోయిస్టుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో అడవుల్లో కష్టమైన ప్రదేశాలను గుర్తించి సమర్థవంతంగా భద్రతా బలగాలు తనిఖీలు జరిపాయి. ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్ స్వయంగా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఆపరేషన్ వివరాలను CRPF అధికారులు ఆయనకు వివరించారు. ఇప్పటికే మావోయిస్టుల డంపులు, సొరంగాలను గుర్తించిన భద్రతా బలగాలు, వాటిని నిర్వీర్యం చేయడంలో విజయవంతమయ్యాయి.
Read Also: Cabinet decisions: జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’..కేంద్రం సంచలన నిర్ణయం..
ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై CRPF బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో కూడా మావోయిస్టుల కదలికలపై గట్టి పట్టు సాధించేందుకు ఇది కీలకదైన అడుగుగా భావిస్తున్నారు అధికారులు. 9 రోజుల పాటు సాగిన ఆపరేషన్‌లో పాల్గొన్న తొలి టీమ్‌ను అధికారులు వెనక్కి పంపించి, కొత్త బృందాన్ని రంగంలోకి దింపారు. దీనితో భద్రతా చర్యలు మరింత బలపడనున్నాయి. సమగ్ర రక్షణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.