NTV Telugu Site icon

Hardeep Singh Nijjar: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ.. కారణం ఇదే..

Hardeep Singh Nijjar

Hardeep Singh Nijjar

Hardeep Singh Nijjar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏకంగా భారత్ పైనే విమర్శలు చేశారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పార్లమెంట్ లో ఆరోపణలు చేశారు. కెనడా, సీనియర్ భారత దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించింది. కెనడా చర్యలపై భారత్ కూడా సీరియస్ గానే స్పందించింది. సీనియర్ కెనడియన్ డిప్లమాట్ ని భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇక భారత్ కెనడా పౌరులకు వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ సమస్య తారాస్థాయికి చేరింది.

ఇదిలా ఉంటే నిజ్జర్ హత్యలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) నిజ్జర్‌ని హతమార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెనడా, ఇండియా సంబంధాలను దెబ్బతీసేందుకు ఇలా చేసే ప్రణాళికలు రూపొందించినట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ గా ఉన్న నిజ్జర్ ని, తమ గ్యాంగ్ స్టర్లకు మద్దతు ఇవ్వాల్సిందిగా పాక్ ఐఎస్ఐ కోరిందని, అయితే నిజ్జర్ అందుకు ఒప్పుకోకపోగా.. ఖలిస్తానీ నాయకుల వైపే మొగ్గు చూపాడని తెలుస్తోంది. స్థానికంగా పాపులారిటీ పెంచుకున్న నిజ్జర్ డ్రగ్స్ అక్రమ దందాను నియంత్రిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిపై పగ పెంచుకున్న ఐఎస్ఐ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీని కోసం ఐఎస్ఐ ఇద్దరు ఏజెంట్లను నియమించినట్లు నిఘా వర్గాల సమాచారం.

Read Also: Side Effects of Apple: యాపిల్ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు

కెనడాలో నిజ్జర్ ఉంటున్న ప్రాంతంలోనే పాకిస్తాన్ ఏజపెంట్లు, మాజీ ఐఎస్ఐ అధికారులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మేజర్ జనరల్స్ నుంచి హవల్దార్ స్థాయి అధికారులు కూడా ఉన్నారట. వీరే నిజ్జర్ కదలికలను తెలుసుకున్నట్లు సమాచారం. జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని సర్రే నగరంలో గురుద్వారాలో ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తున్న నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తుల హతమార్చారు.

అయితే ఈ హత్యపై భారత్-కెనడా సంబంధాలు చాలా వరకు క్షీణించాయి. కెనడాలో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జర్ ని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది. ఇతడిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది.