Operation Sindoor: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’కి భయపడిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారతదేశం, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో ‘‘కాళ్ల మధ్య తోకతో భయపడిన కుక్కలా పాకిస్తాన్ కాల్పులు విరమణ కోసం ప్రయత్నించింది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోగా ఉన్న రూబిన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఎలా భయపడిందనే విషయాలను వెల్లడించారు.
పాకిస్తాన్ సైన్యం ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. భారత్ దౌత్యపరంగా, సైనిక పరంగా విజయం సాధించిందని, ఇప్పుడు అందరి దృష్టి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాదంపై ఉందని చెప్పారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో యూనిఫాంలో పాకిస్తాన్ అధికారులు హాజరైన విషయం వాస్తవమని, ఇది ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ మధ్య ఎలాంటి తేడాలు చూపించడం లేదని చెప్పారు. పాకిస్తాన్ భారత్‌తో ప్రతీ యుద్ధాన్ని ప్రారంభించింది, ఇప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతీ యుద్ధాన్ని గెలిచామని తనను తాను ఒప్పించుకుంటుందని రూబిన్ విమర్శించారు. ఈ 4 రోజుల్లో యుద్ధంలో తాము గెలిచామని ఒప్పించుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. భారత్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలని అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేసిందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ దాడి చేసినప్పుడు, భారత ప్రతి దాడితో బిత్తరపోయిందని, భారత్ పాక్ వైమానిక స్థావరాలు పనిచేయకుండా చేసిందని అన్నారు. పాకిస్తాన్ కాళ్ల మధ్యలో తోకతో భయపడిన కుక్కలా పరిగెత్తుతూ కాల్పుల విరమణకు ప్రయత్నించిందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ చాలా ఘోరంగా ఓడిపోయిందనేది వాస్తవం అని ఆయన అన్నారు. పాకిస్తాన్ సైన్యం ఓడిపోయిన కారణంగా ఆసిమ్ మునీర్ తన పదవికి రాజీనామా చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. పాక్ జనరల్స్ అహంకారం ఆ దేశ భవిష్యత్తు, శ్రేయస్సును తుడిచిపెడుతుందా..? అని అడిగారు. పాకిస్తాన్ తన ఇంటిని ముందు శుభ్రపరుచుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంపుల్ని, వాటి కార్యాలయాల్ని నాశనం చేసింది. ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ తర్వాత భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నించిన పాక్, భారత ప్రతిదాడిలో ఘోరంగా భంగపడింది. భారత్ 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
