షాంఘై సహకార సంస్థ (SCO) చర్చల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ భారత్‌కు వచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ఒక పాకిస్తాన్ మంత్రి భారత్ రావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపడానికి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు. ఉగ్రవాదం, సింధు జలాల ఒప్పందం(Indus Waters Treaty) వంటి కీలక అంశాలపై ప్రశ్నలు ఎదురవగా.. అధికారికంగా చర్చలకు ఆహ్వానిస్తేనే సమాధానాలు చెబుతానంటూ స్పందించారు.
ఎస్‌సీఓ సమావేశాల్లో జరిగిన సందేశాన్ని పాకిస్తాన్ తీసుకెళ్లడమే తన పర్యటన ఉద్దేశమని చెప్పారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉగ్రవాద సమస్యపై అడిగిన ప్రశ్నలకు మాలిక్ స్పందిసతూ.. ఈ సమస్యపై ఆధారాలతో ఏర్పాటు చేసిన అధికారిక చర్చల వ్యవస్థ ద్వారా చర్చించుకోవచ్చని అన్నారు. ఉగ్రవాదం కారణంగా అనేక దేశాలు నష్టపోయాయని, పాకిస్తాన్ కూడా ఎంతో మంది ప్రజలను కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే రెండు దేశాలు కలిసి చర్చించాలని సూచించారు.
సింధు జలాల ఒప్పందంపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన మాలిక్.. ఆ ఒప్పందంపై చర్చించడానికి కూడా భారత్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు. సింధు జలాల ఒప్పందంపై చర్చించడానికి పిలిస్తే తప్పకుండా వస్తానని, కానీ ఇప్పటి వరకు తనను ఆహ్వానించలేదని అన్నారు. తాను కేవలం ఎస్‌సీఓ సమ్మిట్ కోసమే భారత్ వచ్చానని మరోసారి స్పష్టం చేశారు.

