Pakistan: భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని నిరాకరిస్తూ, జనవరి 24 వరకు నిషేధాన్ని పొడగించింది. ఈ మేరకు పాకిస్తాన్ తాజాగా నోటమ్ (Notice to Airmen) జారీ చేసింది. దీనికి ప్రతిగా భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు ఎయిర్‌స్పేస్‌ను నిరాకరించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాలు పరస్పరం గగనతలాన్ని నిషేధించుకున్నాయి. గత 9 నెలలుగా ఇది కొనసాగుతోంది.
ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది. 26 మందిని పాక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. దీని తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ దాడి చేస్తుందనే భయంతో, తన గగనతలాన్ని భారత విమానాలకు ఏప్రిల్ 24 నుంచి నిషేధించింది. భారత్ ఏప్రిల్ 30 నుంచి పాకిస్తాన్ విమానాలపై నిషేధం విధించింది. ఆ తర్వాత ఇరు దేశాలు కూడా ఈ చర్యను పొడగించుకుంటూ వెళ్తోంది.
పాకిస్తాన్ తన గగనతలాన్ని నిరాకరించడంతో భారత విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమాసియా, యూరప్, యూకే, తూర్పు ఉత్తర అమెరికా వంటి గమ్యస్థానాలకు వెళ్లే విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీని వల్ల విమానాల ప్రయాణ కాలం, దూరం, ఇంధన వినియోగం పెరుగుతోంది. సిబ్బంది, విమాన షెడ్యూల్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత వల్ల ఏటా రూ. 4000 కోట్ల అదనపు ఖర్చు అవుతోందని ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ అంచనా వేసింది. పాకిస్తాన్ గతంలో 2019లో నాలుగు నెలలకు పైగా తన గగనతలాన్ని మూసివేసినప్పుడు, భారతీయ విమానయాన సంస్థలు సమిష్టిగా దాదాపు రూ. 700 కోట్ల నష్టాలను చవిచూశాయి. మరోవైపు, పాకిస్తాన్‌కు పెద్దగా నష్టం కనిపించడం లేదు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (PIA) చాలా తక్కువ అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది.
